షైనీ అబ్రహం అంతర్జాతీయ క్రీడా జీవితం తన సహచరిణి అయిన పి.టి.ఉష తో సమానంగా ప్రారంభమైంది. 1982లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలతో వారిరువురి గమనం ఆరంభమైంది. షైనీ అంతకు ముందు ఏడాదే 800 మీటర్ల పరుగులో జాతీయ చాంపియన్ అయింది. అక్కడి నుంచి అథ్లెటిక్స్ నుంచి నిష్క్రమించేదాకా ప్రతీసారి షైనీ జాతీయ క్రీడలలో ఆ ఈవెంట్లో ఆమెకు తిరుగులేకుండా పోయింది. ఆమె 4 ఒలింపిక్ క్రీడలతో పాటు 3 ఆసియా క్రీడలలో పాల్గొంది. 1984లో లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఒలింపిక్స్లో సెమీ ఫైనల్స్ చేరి ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. 1986లో సియోల్ లో జరిగిన ఆసియా క్రీడలలో పరుగుపందెంలో తన ట్రాక్ లైన్ను దాటినందుకు అనర్హత పొందింది. ఆమె ఆ సమయంలో పతకం సాధించే దిశలో ఉండింది. 1992 బార్సిలోనా ఒలింపిక్స్లో భారత పతాకాన్ని పట్టుకొని ఒలింపిక్ క్రీడల మార్చ్ఫాస్ట్ లో జాతీయ పతాకాన్ని పట్టిన తొలి భారతీయ మహిళగా పేరు సంపాదించింది. ఆమె సాధించిన అత్యుత్తమ ప్రతిభ 1:58.8 నిమిషాలు. దీన్ని 1995లో చెన్నైలో జరిగిన దక్షిణాసియా క్రీడలలో నమోదు చేసింది. ఆమె ఆ సమయంలో తన కూతురు శిల్పాకు జన్మనిచ్చింది. అయినా మెరుగైన సమయాన్ని నమోదు చేయడం విషేశం. రెండు నిమిషాల లోపు సమయాన్ని నమోదుచేయడం కూడా ఇదే ప్రథమం.